Surya Grahanam 2022: సూర్యగ్రహణం సందర్భంగా రేపు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, భద్రాద్రి రామయ్య దేవాలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి ఆలయాన్ని రేపు ఉదయం 8.50 నిమిషాల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనుండటంతో రేపు భక్తులచే జరపబడే నిత్యకల్యాణం, శాశ్వత కల్యాణం,శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
అలాగే ఎల్లుండి స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నరసింహ హోమం సైతం రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. రేపు ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్యపూజలు నిర్వహించి ఉదయం 8.50 నిమిషాలకు ఆలయాన్ని మూసివేయనున్నామని ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి భక్తులకు యధావిధిగా స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలియజేశారు. రేపు సాయంత్రం 4.59 నిమిషాలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై అదే రోజు సాయంత్రం 6.28 నిమిషాలకు సూర్యగ్రహణం ముగుస్తుందని తెలియజేశారు.
పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిని రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ పరిపాలన అధికారులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల లోపు అన్ని ఆరాధనలు నివేదనలు, నిత్య కళ్యాణం పూర్తిచేసి 10 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు స్థల సాయి ఆలయ స్థానాచార్యులు పేర్కొన్నారు. మళ్లీ సాయంత్రం ఏడు గంటలకు ఆలయ తలుపులు తెరిచి గోదావరి నది వద్ద నుంచి తీర్థ బిందేతో గోదావరి జలాన్ని తీసుకువచ్చి ఆలయ శుద్ధి నిర్వహించిన తరవాత అన్ని దేవతామూర్తులకు అభిషేకం నిర్వహిస్తామని అన్నారు. భద్రాద్రి రామయ్యకు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 26వ తేదీ ఉదయం నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: