RRR Farmers started Relay Hunger strike In Yadadri bhuvanagiri district : అలైన్మెంట్ మార్చాలని త్రిబుల్ ఆర్ ( రీజినల్ రింగు రోడ్డు) బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రిలే దీక్షకు జిల్లా నలుమూలల నుంచి బాధిత రైతులు హాజరయ్యారు. దీనిలో భాగంగా తొలిరోజు దీక్షలో గద్దర్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న గద్దర్ తనదైన శైలిలో అధికారుల తీరును నిరసిస్తూ పాటలు పాడి.. బాధిత రైతులను ఉత్సాహ పరిచారు. అధికారులకు, ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టవని ఎద్దేవా చేశారు.
RRR Farmers Relay Hunger strikes: ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి సభ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం మొదలైందని గుర్తు చేశారు. పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే పంజాబ్‌లో రైతులు పోరాటాలు చేసి వాటిని రద్దు చేయించారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా త్రిబుల్ ఆర్ రహదారి నిర్మాణం భూసేకరణ జీవోను రద్దు చేయిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. భూములు కోల్పోతున్న రైతులకు భూమిని మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
ధరణి పేరుతో పెద్ద కుట్ర : తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ప్రజా యుద్ధ నౌక గద్దర్ విమర్శించారు. భూమి సమస్య తెలంగాణ సమస్య అన్న ఆయన.. నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందన్నారు. ధరణి అనే పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని గద్దర్ ఆరోపించారు. పంట పెట్టుబడి సాయం పేరుతో రైతుల భూములను బీడు భూములుగా మార్చారని రాష్ట్ర ప్రభుత్వంపై గద్దర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడు భూములను కార్పొరేట్‌కు ధారాదత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతుల పోరాటానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం భూములు కోల్పోయాం : రీజినల్ రింగు రోడ్డులో భూములు కోల్పోతున్న రాయగిరి రైతులు ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల తాము ఎంతో కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం కోసం, రాయగిరి నుంచి యాదగిరిగుట్ట రహదారి విస్తరణ కోసం, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం ప్రాజెక్టు ప్రధాన కాలువల నిర్మాణం కోసం తాము భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రాంతీయ రింగురోడ్డు కోసం రాయగిరి గ్రామంలో 266 ఎకరాలు సేకరిస్తున్నారని ఇప్పటికే మూడు సార్లు భూములు కోల్పోయామని.. మరోసారి ప్రభుత్వం తమ భూమిని తీసుకుంటామంటే బతికేది ఎట్లా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలు భూములు కోల్పోయేలా అలైన్మెంట్ : కోట్ల రూపాయల విలువ చేసే తమ భూములకు ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే నామమాత్రపు నష్టపరిహారంతో పరిసర ప్రాంతాల్లో కనీసం 100 గజాల భూమిని కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. పెద్దల భూములు కోల్పోకుండా పేదలు భూములు కోల్పోయేలా అలైన్‌మెంట్‌ను మార్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: