'అనంతమైన ఆత్మస్థైర్యాన్ని నింపే సాహస యాత్రలయితే విదేశాల్లోనే చేయగలం. అందమైన అనుభవాలు పంచే పర్వతారోహాలు చేయాలంటే ఉత్తరాదికి వెళ్లాల్సిందే..' అనుకుంటారు చాలామంది. అందుకే, సాహసాలు చేయాలనే ఆశ ఉన్నా అంత దూరం వెళ్లే సమయం లేక, ఖర్చులు తాళలేక ఆ ఆలోచనను అణచివేస్తుంటారు. పైగా కొత్తగా పర్వతారోహాలు చేయాలంటే ఏదో తెలియని భయం. కానీ, ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టి మీ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసే చోటు తెలంగాణలోనే ఉంది.. అదే 'రాక్ క్లైంబింగ్ స్కూల్' (పర్వతారోహణ పాఠశాల). మరి ఆ సాహసాల పాఠశాల ప్రత్యేకతలేంటో మీరే చూసేయండి..
అలా మొదలైంది..
దక్షిణ భారత దేశంలో నెలకొన్న ఏకైక 'రాక్ క్లైంబింగ్ స్కూల్' ఇది. హైదరాబాద్ కు కేవలం 35 కి.మీల దూరంలో.. చారిత్రక భువనగిరి ఖిల్లాను ఆనుకుని ఉంటుంది. 2014లో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పర్యటక శాఖ సంయుక్తంగా స్థాపించిన ఈ స్కూల్ లో ప్రపంచంలోని ఏ కొండనైనా అవలీలగా ఎక్కేయడానికి కావలసినవన్నీ నేర్పిస్తారు.
పర్వాతారోహణంలో ఏళ్ల అనుభవం కలిగిన పరమేశ్ కుమార్ సింగ్, శేఖర్ బాబుల ఆధ్వర్యంలో దాదాపు 30 మంది ఇస్ట్రక్టర్లు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. వీరిలో ఐదుగురు మహిళా ఇస్ట్రక్టర్లు కూడా ఉండడం విశేషం. అందుకే, ఇక్కడ శిక్షణ పొందేందుకు మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. ఏటా సాహసారోహ కోర్సులు నేర్చుకోడానికి దేశ నలుమూలల నుంచి పర్యటకులు భువనగిరికి తరలివస్తుంటారు.
బాహుబలి కొండలెక్కెనిలా..
ఇప్పటివరకు దాదాపు ఐదు వేల మంది పర్వతారోహకులను తయారు చేసిందీ స్కూల్. అతి పిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని మరింత పెంచేసిన మలావత్ పూర్ణ, ఆనంద్ లు భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ విద్యార్థులే. అంతెందుకు ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు పొందిన మన బాహుబలి అంతెత్తు కొండలను సులభంగా ఎక్కడానికి ఇక్కడే శిక్షణ పొందారు. ఇలా బోలెడు మంది ప్రముఖులు ఈ స్కూల్ ఆధ్వర్యంలో సాహసాలు చేసి సత్తా మధురానుభూతులను పోగు చేసుకున్నారు.
శిక్షణలో ఏముంటాయి?
భువనగిరి కొండ మీద శిక్షణ పొందితే ఎంతటి క్లిష్టమైన పర్వతాలైనా ఇట్టే ఎక్కేసే నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు రాక్ క్లైంబింగ్ స్కూల్ నిర్వాహకులు. కేవలం కాలి వేళ్లు, చేతి వేళ్లతో కొన్ని వందల మీటర్ల ఎత్తున్న శిఖరాలను అధిరోహించే చిట్కాలూ తెలుసుకోవచ్చంటున్నారు. పదేళ్ల వయసు నిండి, ఆరోగ్యంగా ఉండి ఆసక్తి కలవారు ఎవ్వరైనా సరే ఈ శిక్షణకు అర్హులేని తెలిపారు.
⦁ బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, అడ్వెంచర్ వంటి నాలుగు దశల్లో నిర్వహించే రాక్ క్లైంబింగ్ కోర్సులతో పాటు.. ఒక్క రోజులో అద్భుత అనుభూతిని పంచే సాహస కోర్సులెన్నో ఈ స్కూల్ సొంతం.
⦁ నిపుణుల పర్యవేక్షణలో అత్యంత సురక్షిత వాతావరణంలో క్లైంబింగ్, ర్యాప్లింగ్, బౌల్డరింగ్, బ్యాలెన్సింగ్, హైకింగ్ వంటి యాక్టివీటీలు నిర్వహించడం మరో ప్రత్యేకత.
⦁ పర్వతారోహణంలో అధునాతన పరికరాలను ఎలా ఉపయోగించాలి, తాళ్ల సాయంతో మంచు కొండలను సైతం ఎలా ఎక్కేయాలో తెలుసుకునే వీలు కల్పిస్తోంది.
⦁ అంతే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ పొందే పర్యటకులు వసతి కోసం ఇబ్బందులు పడకుండా.. భోజనం, రాత్రి వేళల్లో క్యాంపింగ్ సౌకర్యమూ కల్పిస్తోందీ రాక్ క్లైంబింగ్ స్కూల్. అందుకే ఈ శిక్షణ తరగతులకు ఈ తరం యువకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
⦁ ఇన్ని నేర్పిస్తున్నారంటే ఫీజు కూడా భారీగానే వసూలు చేస్తారనుకుంటున్నారేమో.. సామాన్యుడు సైతం సులువుగా శిక్షణ పొందే విధంగా అతి తక్కువ ఫీజుతో.. ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్.
సాహసంలోని భిన్నమైన అనుభూతిని ఆస్వాధించడమే కాదు.. ఓ రెండు రోజులు మీతో మీరు అవును అచ్చంగా మీకోసం మీరు గడిపే అవకాశం కల్పిస్తోంది రాక్ క్లైంబింగ్ స్కూల్. మరింకెందుకు ఆలస్యం ఓ సారి భువనగిరికి చేరుకుని పర్వతారోహణంలోని సాహసం, సవాళ్ల సంగతేంటో తేల్చేయండి.