యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా నిర్మించిన బ్రహ్మోత్సవ మండపం వద్ద ఫ్లోరింగ్ బండలు కుంగిపోయి పగుళ్లు రావటం వల్ల ఈనెల 19న ఈనాడు- ఈటీవీ భారత్లో "యాదాద్రి బ్రహ్మోత్సవ మండపం వద్ద పగుళ్లు" శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన వైటీడీఏ అధికారులు శుక్రవారం మరమ్మతులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవ మండపం వద్ద ప్రధానాలయం దక్షిణ భాగంలో మొత్తం 500 బండలకు పైగా కుంగినట్లు గుర్తించి ఆ బండలను తొలగించారు.
వాటి స్థానంలో బరువు తక్కువగా ఉన్న బండలు వేయాలని నిర్ణయించినట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. ఫ్లోరింగ్ కుంగి పోవడానికి లోపం ఎక్కడ ఉందనే అంశాన్ని పరిశీలించారు. ఫ్లోరింగ్ వద్ద కూలీలతో పాటు జేసీబీతో తొలగించారు. బ్రహ్మోత్సవ మండపం వద్ద పగుళ్లు వచ్చిన రాయిని తొలగించారు. ఈ పనులు జరుగుతుండటం వల్ల సమీపంలోకి కూలీలను తప్ప మరెవరిని అధికారులు రానివ్వడం లేదు.