యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని రావుల గూడెం చెరువు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిండుకుండలా మారింది. వరద ప్రవాహంతో చెరువు అలుగు పోస్తుంది. దీంతో గ్రామస్థులు, అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. కానీ అలుగు పోస్తున్న తరుణంలో అలుగు కట్ట సామర్థ్యం తగ్గిపోయి శిథిలావస్థ స్థితికి చేరుకుంది. దీంతో నీటి తీవ్రతక తట్టుకోలేక గండి పడింది. రెండు నెలల కిందటే గండి పడటంతో గమనించిన ప్రజలు.. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లారు.. కానీ ఇంతవరకు మరమ్మతు చర్యలు చేపట్టకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు అలుగు తెగిపోతే దాని కింద సాగు చేస్తున్న పంట పొలాలు వరదల్లో కొట్టుకుపోయి పూర్తిగా నీట మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగువన ఉన్న తిమ్మప్ప చెరువులోకి వరద నీటి తాకిడితో ఆ చెరువు కట్ట కూడా.. నీటిని ఆపే సామర్థ్యం లేక తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. అలా జరిగితే గ్రామంలోకి వరద కొట్టుకొచ్చి ఇళ్లన్నీ నీట మునిగి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని గోడు వెల్లబోసుకున్నారు. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్థులే దిక్కుతోచని పరిస్థితుల్లో తాత్కాలిక చర్యలు చేపట్టారు. అలుగును ఆపేందుకు సంచుల్లో ఇసుక నింపి గండి పడిన చోట పూడ్చివేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని, ఊరిని, పంట పొలాలను కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Dalitha Bandhu Scheme : వాసాలమర్రిలో ఎస్సీ కార్పొరేషన్ అధికారుల పర్యటన