హైదరాబాద్ ఉప్పల్ పొలీసు స్టేషన్ పరిధిలో వెలసిన గ్రీన్ గోల్డ్ బయోటిక్ సంస్థ మాటలు నమ్మి యాదాద్రి భువనగిరి జిల్లా రాఘవాపురం గ్రామస్థుడు రాగటి స్వామి గత సంవత్సరం లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. సంస్థ నిర్వాహకులు ఒక నూనె తయారు యంత్రాన్ని, రెండు క్వింటాళ్ల పల్లీలను, నూనె నిల్వ కోసం ప్లాస్టిక్ క్యాన్లు ఇచ్చారు. అంతే కాకుండా ఇంకెవరితోనైనా డబ్బు డిపాజిట్ చేయిస్తే... కమిషన్ ఇస్తానని చెప్పారు.
స్వామి కొన్నాళ్లు నూనె తీసి సంస్థకు అందించాడు. నెలకు సుమారు 10 వేల వరకు సంపాదించడంతో అదే గ్రామానికి చెందిన మరికొందరు లక్ష చొప్పున డిపాజిట్ చేశారు. ఒక్కసారి నూనెను తీసి సంస్థకు అందించినందుకు రూ.15 వేల చొప్పున వేతనంగా పొందారు.
ఆ తరువాత నుంచి నిర్వాహకులు మెహం చాటేశారు. పది రోజుల క్రితం ఉప్పల్ పోలీసులు గ్రీన్ గోల్డ్ బయోటిక్ సంస్థ నిర్వాహకుడు జెన్నా శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో రాఘవాపురం నూనె బాధితులు వెలుగులోకి వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు, వలిగొండ మండలాల్లో ఇంకొంత మంది బాధితులు ఉన్నారు.
రాబోయే రోజుల్లో ఇంకెందరు పల్లి నూనె బాధితులు వెలుగులోకి వస్తారో చూడాలి.