Climate Change Impacts On AP : వాతావరణ మార్పులు జీవకోటికి, ప్రభుత్వాలకు పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఏపీలోని జిల్లాలు అన్నీ ప్రకృతి విపత్తులతో ప్రభావితం అవుతున్నాయి. తుపాన్లు, వాయుగుండాలు, వరదలు, పిడుగుపాట్లు, వడగాలులు, కొండచరియలు విరిగిపడడం లాంటి ఘటనలతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. భూతాపం పెరగడంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు వరద ముప్పు, మరికొన్ని జిల్లాలకు కరవు ముప్పు ఉంది.
ఐఐటీ గువాహటి, ఐఐటీ మండీ కలసి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ) సహకారంతో తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందన్నారు. ఈ పరిశోధన సూచీలకు అభివృద్ధితో సంబంధం ఉంటుందని వాతావరణ నిపుణులు సూచించారు. ప్రభుత్వాలు వాటిని పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాల సన్నద్ధత, నష్ట నివారణకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని తెలిపారు.
భారీ వర్షాలతో అతలాకుతలం : ఏపీలో 44 శాతం భూభాగం తుపాన్లు, సంబంధిత ప్రమాదాలకు ఆలవాలమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఏటా ఏప్రిల్-జూన్ మధ్యలో, డిసెంబరు తర్వాత ఏపీపై తుపాన్ల ప్రభావం కనపడుతోంది. నైరుతి రుతుపవనాల సమయంలో ఒక్క తుపానైనా కోస్తా తీరాన్ని తాకుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల కాలంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జిల్లాల్లో వరదలు, మరికొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితులు వస్తున్నాయి.
ఆయా కాలాల్లో ఏపీలో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, నాగావళి, వంశధార తదితర నదుల్లో నీటిమట్టాలు ఎక్కవతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాలు అతలాకుతలానికి గురవుతున్నాయి. 2005 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతం వరదలతో తీవ్రంగా దెబ్బతింటుంది. 2005లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటిమట్టం పెరగడంతో అత్యధికంగా 10 ఉమ్మడి జిల్లాలు ఇబ్బందులకు గురయ్యాయి.
వరద ముప్పును ఎదుర్కొనే ఉమ్మడి జిల్లాలు : తాజా అధ్యయనం ప్రకారం వరద ముప్పును ఎదుర్కొనే ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. అల్పంగా విశాఖపట్నం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.
కరవు ముప్పు పొంచి ఉన్న ఉమ్మడి జిల్లాలు : ఏపీలో ఎక్కువగా కరువు పొంచి ఉన్న ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు ఉన్నాయి. మధ్యస్థంగా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా నెల్లూరు జిల్లా ఉంది.
"ప్రకృతి విపత్తుల సమయంలో ఇళ్లు కోల్పోయారు. నిర్వాసితులను తుపాను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పూరిళ్లు, పెంకుటిళ్లలో నివసించేవారికి పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలి. తుపాన్ల సమయంలో విద్యుత్ రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. అన్ని రకాల ప్రకృతి విపత్తులను తట్టుకునేలా రోడ్లు, కల్వర్టులు, వంతెనలు నిర్మించాలి." -కేజే రమేశ్, వాతావరణ నిపుణులు
తీవ్ర అల్పపీడనం బలహీనపడే అవకాశం - ఆ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు