lack of facilities in yadadri: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా భక్తులు గిరిప్రదక్షిణ చేసే మార్గం గుంతలమయంగా మారింది. యాదాద్రిలో గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరి ప్రదక్షిణ కోసం కావాల్సిన మార్గంపై అప్పట్లో ప్రత్యేకంగా దృష్టి సారించారు. భక్తులు కొండ చుట్టూ తిరిగి అనంతరం స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామివారి జన్మ నక్షత్రం రోజు ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
పిచ్చిమొక్కలతో గిరిమార్గం: కొండ ఉత్తర భాగంలో అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు మార్గంలో పిచ్చిమొక్కలు మొలిచి, రాళ్లు తేలాయి. లోతైన గుంతలు ఏర్పడటంతో కాలినడకన వచ్చే భక్తులకు ఆసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ అంశంపై రోడ్డు భవనాల శాఖ ఏఈ కరుణాకర్‌ను సంప్రదించగా త్వరలోనే రహదారికి మరమ్మతులు చేపడతామని తెలిపారు.
పాకురుపట్టిన పుష్కరిణి: అదేవిధంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కొండ కింద ప్రత్యేకంగా నిర్మించిన లక్ష్మీ పుష్కరణి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రికి వచ్చే యాత్రికులు పుష్కరణిలో పవిత్ర స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. కానీ ఆ నీరు పాకురుపట్టి ఆకుపచ్చగా మారింది. దీంతో అందులో స్నానమాచరించడానికి జంకుతున్నారు. మరోపక్క స్నానపుగదులు కొన్నింటిని మాత్రమే తెరచి మిగతా వాటికి తాళాలు వేసి ఉంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని వారు వాపోతున్నారు.
ప్రభుత్వం ముందుచూపుతో కొండ కింద గండిచెరువు వద్ద 68మీటర్ల పొడవు, 58 మీటర్ల వెడల్పుతో విశాలంగా లక్ష్మీ పుష్కరణి నిర్మించారు. 150 స్నానపుగదులు ఏర్పాటు చేశారు. ఇటీవల నిత్యం ఆరు వేల మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని అంచనా. శని, ఆదివారాలు, పండుగలు, సెలవురోజుల్లో 10 వేల మందికి పైగా యాత్రికులు పుణ్యస్నానాలు చేస్తారు. సీజనల్ వ్యాధులు ప్రబలే కాలంలో పుష్కరిణిని పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచాలని.. సరైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: భారీగా పెరిగిన ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు, ఆ ర్యాంకు దాటినవారిపై మరింత భారం