Munugode Bypoll Campaign: అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తుతున్న మునుగోడు పోరు.. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంతో మరింత వేడెక్కింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని భాజపా కుట్రలు చేస్తోందంటూ అధికార పార్టీ ఆందోళనలకు దిగింది. ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌లో నల్లచొక్కా ధరించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన చేపట్టారు.
భాజపా కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి: చౌటుప్పల్ మండలం నాగారంలో ప్రచారం నిర్వహించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై నిరసన వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డిలాగా తెరాస ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదన్న ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్‌కు భయపడే తెరాస ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు మోదీ, అమిత్ షా కుట్రలు చేశారని ఆరోపించారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌లో తెరాస చేప్టటిన ఆందోళనలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. స్వామిజీలను ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వంలోకి లాగడం సిగ్గు చేటని విమర్శించారు. భాజపా కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.
భారాసను చూసి ఓర్వలేక భాజపా కుట్రలు: నారాయణపురం మండలం మర్రిబాయి తండాలో తెరాస శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర చీకటి అధ్యాయమన్న సత్యవతి మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని చురుకలంటించారు. భారాసను చూసి ఓర్వలేక భాజపా కుట్రలు చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ విమర్శించారు.
భాజపా సైతం ఆందోళనలు: ప్రజాస్వామ్యాన్ని భాజపా ఖూనీ చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. నాంపల్లిలో పర్యటించిన మంత్రి తలసాని 'ఎమ్మెల్యేలకు ఎర' వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయటమే భాజపా లక్ష్యమా అని ప్రశ్నించారు. తెరాస ఆరోపణలపై అటు భాజపా సైతం ఆందోళనలు చేపట్టింది. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ దర్శకత్వంలో ఇలాంటి నాటకాలకు తెరలేపారంటూ నియోజకవర్గ వ్యాప్తంగా కమలం నేతలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు.
తెరాసపై తీవ్ర విమర్శలు: చండూరు పురపాలిక ప్రధాన కూడలిలో భాజపా శ్రేణులు బైఠాయించి తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం డామిట్ కథ అడ్డం తిరిగింది.. లెక్క తయారైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చొరవ తీసుకుని సీసీ ఫుటేజీ, కాల్ లిస్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌తో పాటు న్యాయపోరాటం చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రికి వచ్చి స్వామి వద్ద ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ చేశారు. రాజకీయ ప్రకపంపనలు రేపుతున్న ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం మునుగోడు ప్రచార సరళిని మార్చేసింది. ప్రజల్లోకి వెళ్లాల్సిన నేతలు రోడ్లపై బైఠాయించి పోటాపోటీగా నిరసనలకు దిగారు.
ఇవీ చదవండి: తెరాస, భాజపాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి: రాహుల్ గాంధీ
'ఎమ్మెల్యేల కొనుగోలు కొత్తేం కాదు.. బయటపడని వారు ఇంకెందరో..!'
ఆ ఎన్కౌంటర్లో పోలీసులే దోషులు.. 30 ఏళ్ల తర్వాత కుటుంబానికి న్యాయం