పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిన ఎల్ఆర్ఎస్ను రద్దు చేసే వరకు పోరాడుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురంలో 2 కోట్ల 67 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో ఆయన కలిసి పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై హైకోర్టులో కేసు వేశామన్న ఎంపీ... దీనిని రద్దు చేయడానికి సుప్రీంకోర్టుకైనా వెళ్తామన్నారు.
పేద ప్రజల భూములు గుంజుకొని స్మశాన వాటికలు, రైతు వేదికలు నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే రైతు వేదికలు, స్మశాన వాటికలు నిర్మిస్తున్నారు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదన్నారు. ఎల్ఆర్ఎస్తో వచ్చిన డబ్బులను కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి పథకాల్లో పెట్టి కమీషన్లు దండుకోవాలని సీఎం చూస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 20వేల మంది ఒక్కటై... నదిని బతికించుకున్నారు!