సీఎం కేసీఆర్ ఊహలకు ప్రతిరూపమే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన ఆలోచనలు, ఊహలను శిల్పులు కళ్లకు కట్టినట్లు సాక్షాత్కరింపజేశారని కొనియాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ నిర్మాణం పూర్తి చేయడంలో సీఎం కృషి వెలకట్టలేనిదన్నారు. యాదాద్రి ఆలయం పనులు తుదిదశకు చేరిన నేపథ్యంలో లైటింగ్‌ను శనివారం రాత్రి మంత్రి పరిశీలించారు. ఈ నెల 14న సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి సందర్శించే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై ఆరా తీశారు.
ప్రధానాలయానికి సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాల అలంకరణ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో శనివారం ఏర్పాటు చేశారు. హరిత గెస్ట్ హౌస్‌లో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కొండపైన నూతనంగా నిర్మించిన ఈవో కార్యాలయం, అతిథి గృహం, ఇత్తడి దర్శన వరుసల పనులపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయనగరిపై హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, సీఎంవో భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఈఎన్సీ రవీందర్ రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: 'అరశాతం అప్పు కోసం.. ప్రైవేటికరణా?'