మహారాష్ట్ర నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న 8 మంది వలస కూలీలను హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన 8 మంది బతుకుదెరువు కోసం మహారాష్ట్ర వెళ్లి కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు కారణంగా మహారాష్ట్ర నుంచి ముగ్గురు చిన్నారులతో కలిసి మొత్తం 11 మంది యాదగిరిగుట్టకు వచ్చారు.
ఏడుగురికి హై ఫీవర్....
విషయం తెలుసుకున్న పోలీసులు పరీక్షల నిమిత్తం వీరిని యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు వీరిని పరీక్షించగా 11 మందిలో ఏడుగురికి హైఫీవర్ ఉన్నట్లు తెలిసింది. కోవిడ్-19 పరీక్షల కోసం 108 వాహనంలో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు కూలీలకు మధ్య వాగ్వాదం
వలసకూలీలు వచ్చారన్న సమాచారంతో పరీక్షల కోసం యాదగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరీక్షలు చేసుకోవాలని నచ్చజెప్పుతున్న క్రమంలో పోలీసులకు కూలీలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ మహిళ గిన్నెతో పోలీసులపై దాడి చేసింది. ఈ ఘటనలో సీఐ పాండురంగారెడ్డి తలకు స్వల్ప గాయమైంది. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం కూలీలకు పరిస్థితిని వివరించి పరీక్షలకు పంపించారు.