యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలస కార్మికులతో పాటు ఇతర జిల్లాల్లోని పలువురు కార్మికులను నేడు తెల్లవారుజామున బీబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి వారి వారి స్వరాష్ట్రాలకు పంపారు. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులతో ఓ ప్రత్యేక రైలు తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు అధికారుల చప్పట్ల మధ్య బయలుదేరింది. మరో ట్రైన్ ఉదయం 6 గంటల 40 నిమిషాలకు బయలుదేరి వెళ్లింది. రెండు రైళ్లలో సుమారు 2 వేల మందికి పైగా వలస కూలీలు స్వస్థలాలకు చేరుకోనున్నారు.
వివిధ జిల్లాల నుంచి వలస కార్మికులందరినీ ప్రత్యేక బస్సుల్లో మంగళవారం రాత్రి బీబీనగర్ రైల్వే స్టేషన్‌కి తీసుకొచ్చారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. జిల్లా ఇంఛార్జి డీఎంహెచ్‌వో మనోహర్ ఆధ్వర్యంలో 50 మంది వైద్య బృందం కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ స్వస్థలాలకు బయలు దేరుతుండటం వల్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.