MANCHU LAXMI: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సినీనటి మంచు లక్ష్మి సందడి చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, విద్యాశాఖ అధికారులతో కలిసి సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి అధికారులు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 50 పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు అధికారులతో మంచు లక్ష్మి 'మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్' కుదర్చుకున్నారు.
ఈ సందర్భంగా గత 8 ఏళ్లుగా 'టీచ్ ఫర్ ఛేంజ్ ' అనే ఎన్జీవోను నడుపుతున్నట్లు మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మన ఊరు-మన బడి'లో భాగస్వాములు అవుతున్నట్లు వివరించారు.
8 ఏళ్ల క్రితం టీచ్ ఫర్ ఛేంజ్ అనే చిన్న ఎన్జీవోను ప్రారంభించాం. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ని తగ్గించాలి, నాణ్యమైన విద్యను అందించాలనేది దీని ముఖ్య లక్ష్యం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకంలో మేమూ భాగస్వాములమవుతున్నాం. జిల్లాలోని 50 స్కూళ్లతో మేము 'మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్' చేసుకున్నాం. మేం ఎలా పని చేస్తామో ఒక మూడేళ్లలో మీరే చూస్తారు.-మంచు లక్ష్మి, సినీ నటి
అనంతరం ఆలేరు మండలం పటేల్ గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలసి మంచు లక్ష్మి డిజిటల్ తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
యాదాద్రి సందర్శన..: అనంతరం మంచు లక్ష్మి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా శ్రావణమాసంలో ఆలయంలో నిర్వహించే 'కోటి కుంకుమార్చన' టికెట్‌ను మంచు లక్ష్మి కొనుగోలు చేశారు.
ఇవీ చూడండి..
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదు.. కేంద్రం స్పష్టం
భారీ కటౌట్స్, డ్యాన్స్‌లు.. ట్రైలర్ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్' ఫ్యాన్స్