లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో యాదాద్రి స్వామి వారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం లక్ష్మీపూజలు ఏకాంత సేవలో శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయంలోని కవచమూర్తులకు వేదమంత్రాల మధ్య సువర్ణపుష్పాలతో అర్చక బృందం పూజలు నిర్వహించారు. మొదటగా శ్రీమన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చన జరిపారు. సాయంత్రం వేళ బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి వేదమంత్ర పఠనాల మధ్య ఊంజల్ సేవను నిర్వహించారు.
నిత్య కల్యాణం..
అనంతరం అమ్మవారిని బాలాలయ ముఖమండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం సాగింది. బాలాలయంలో లక్ష్మీనారసింహులను దివ్యమనోహరంగా అలంకరించి, నిత్య కల్యాణోత్సవాన్ని భక్తులు లేకుండా జరిపారు.
సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారికి రోజువారి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభించిన నిత్యవిధి కైంకర్యాలు రాత్రి శయనోత్సవాలతో ముగిశాయి.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 4,305 కరోనా కేసులు, 29 మరణాలు