యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామంలోని 72 ఏళ్ల చరిత్ర కలిగిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వేలాదిమంది విద్యార్థులు చదువుకొని ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. వైద్యులు, ఉపాధ్యాయులు, మిలిటరీ ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లులుగా దేశవిదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంత మందికి జీవితానిచ్చిన ఆ పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరి మూతపడే పరిస్థితికి వచ్చింది. ఎలాగైనా సరే బడిని బతికించుకోవాలనుకున్న యువకులు పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. గ్రామాభివృద్ధి కమిటీతో సమావేశాలు జరిపి బృహత్తరమైన కార్యక్రమం మొదలు పెట్టారు.
విద్యావాలంటీర్లను నియమించారు
ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారి నుంచి విరాళాలు సేకరించారు. డబ్బు ఇవ్వలేని వారు శ్రమదానం చేసి భవన నిర్మాణ పనుల్లో భాగం పంచుకున్నారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి చదును చేశారు. శౌచాలయాలు, నీటి ట్యాంకు, తరగతి గదుల నిర్మాణం, వాటికి రంగులు, పిల్లలను ఆకర్షించే విధంగా భిన్నమైన బొమ్మలను వేశారు. గతంలో 32 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడున్నాడని... మరో నలుగురు విద్యావాలంటీర్లను నియమించారు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సభ్యులు.
ఉచితంగా టై, బెల్టు, షూల పంపిణీ
బడులు ప్రారంభమయ్యే సమయంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఉచితంగా ఆంగ్లమాధ్యమంలో విద్యనందించే బాధ్యత తమదని చెప్పి పిల్లలను సర్కారు బడికే వచ్చే విధంగా చేశారు. పిల్లలకు టై, బెల్టు, షూస్ కూడా వారే అందించారు. ఇన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల గ్రామంలో ఏ ఒక్క చిన్నారి కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లట్లేదు. గతంలో 32 మంది పిల్లలు మాత్రమే ఉండగా... ప్రస్తుతం 88 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల డీఈవో... డిప్టేషన్పై ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. గతంలో ఒక్కరే ఉపాధ్యాయుడున్న ఈ పాఠశాలలో ప్రస్తుతం ఏడుగురున్నారు.
ఆదర్శంగా నిలవాలి
పాఠశాల అభివృద్ధి చెంది... జిల్లాలోనే అగ్రగామిగా నిలవాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. వారి చైతన్యం చూసి జిల్లాలోని ఇతర గ్రామాల ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాలనుకుంటున్నారు.