యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారానికి చిరునామాగా నిలిచిన, రెండు ప్రముఖ సంస్థలపై ఆదాయపన్ను శాఖ పంజా విసిరింది. వాటికి సంబంధించిన కార్యాలయాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఓ సంస్థకు ఎల్బీ నగర్‌లో, మరో సంస్థకు కొత్తపేటలో కార్యాలయాలు ఉండగా వాటిల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగాయి.
ఐటీ సోదాలతో స్థిరాస్తి వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. అలాగే యాదగిరిగుట్ట పట్టణంలో ప్రముఖ వ్యాపారి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత బీర్ల అయిలయ్య నివాసంలోను ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పది మందికి పైగా అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఐలయ్య ఇంట్లోనే ఉన్నారు. భూములకు సంబంధించిన దస్తావేజులు, నగదు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు తదితర వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం కుటుంబ సభ్యులను బ్యాంకు వద్దకు తీసుకెళ్లడం కనిపించింది. ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్న రెండు సంస్థలు మోట కొండూరు, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించాయి.
ఇదీ చూడండి : నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై సీఎం సమాలోచనలు