KTR Participated In Industrial Progress Festivals : రాబోయే ఎన్నికల కోసం కాదు.. రాబోయే తరాల కోసం కేసీఆర్ పని చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రం, కామన్ ఫెసిలిటీ సెంటర్, వ్యర్థాల శుద్ధి కేంద్రం, ఐలా కార్యాలయం, పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యాలయాలను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అద్భుత పురోగతితో.. తెలంగాణలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రాష్ట్రంలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతోందని హర్షం వ్యక్తం చేశారు.
- TS Formation Day 2023 : 'రానే రాదన్న తెలంగాణను సాధించి.. కానే కాదన్న అభివృద్ధిని చేసింది.. కేసీఆర్'
అన్ని రంగాల్లోనూ మనమే నంబర్ వన్ : సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ర్యాంకింగ్‌లో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో నంబర్ వన్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ఆనందించారు. ఇదే కాకుండా టీఎస్ ఐపాస్ ద్వారా స్వీయ ధ్రువీకరణతో ఎవరైనా పరిశ్రమ ప్రారంభించొచ్చని.. కేవలం 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మానవ ప్రయత్నం హరితహారమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పర్యావరణం.. రెండింటినీ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కేవలం 3 శాతం మాత్రమే ఉన్న భూభాగం తెలంగాణ.. కానీ 30 శాతం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని కొనియాడారు.
"రాష్ట్రంలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి జరుగుతుంది. అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో. తెలంగాణలో ఒకవైపు సంక్షేమం ఉంది.. మరోవైపు అభివృద్ధి ఉంది. రూ.2000 ఫించన్‌ను ముసలి అవ్వ తీసుకుంటుంది. అలాగే పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల రాయితీలను తీసుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో ఒకవైపు సాగునీరు మరోవైపు తాగు నీటి కోసం పెద్దపీట వేశారు కేసీఆర్." - కేటీఆర్, మంత్రి
KTR Launched Common Facility Center : రాష్ట్ర విభజన జరగకముందు ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారని.. అసత్య ప్రసారం సాగిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఈ తెలంగాణనే దేశానికి పాఠాలు చెబుతోందని.. అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మెచ్చుకుంటున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా మోదీ పాలించిన గుజరాత్లో విద్యుత్ కొరత ఉందని.. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. చిన్నారుల కోసం బొమ్మలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ టాయ్స్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ వేడుకల్లోనే ఏకకాలంలో 51 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మంత్రులు ప్రారంభించారు.
ఇవీ చదవండి :