Husband and wife died in Yadadri : భార్యభర్తల మధ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాహం జరిగిన కొద్ది నెలలకే పెళ్లిపెటాకులు అవ్వడం తరచూ చూస్తున్నాం. భార్యకు ఖరీదైన నగలు కొనివ్వలేదని.. ఇష్టమైన హీరో సినిమాకి తీసుకెళ్లలేదని అలిగి విడాకులు ఇచ్చిన సందర్భాలూ లేకపోలేదు. వివాహేతర సంబంధాలతోనూ జీవితాలు ఎంత ఆగం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ యాదాద్రిలో ఓ వృద్ధ దంపతుల మరణం నేటి సమాజానికి ఎంతో ఆదర్శం. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట.. ఆరు పదుల వయస్సు వరకు ఏనాడు దూరం కాలేదు. కష్టం, సుఖం, సంతోషం అన్ని సందర్భాలనూ పంచుకుంటూ సంసారం అనే నావను విజయవంతంగా సాగర తీరం వైపు నడిపించారు. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నత శిఖరాల వైపు వారిని నడిపించారు. ఇంతలో వృద్ధాప్యం వారిని పలకరించింది. అనారోగ్య సమస్యలు వారిని చుట్టుముట్టాయి.
వేధించిన అనారోగ్య సమస్యలు: దీంతో భార్య మృతి చెందగా.. మరణ వార్త విన్న భర్త గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భవనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం జంగపల్లి గ్రామంలో మాటూరి లక్ష్మమ్మ (68), శంకరయ్య (78) దంపతులు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తొలుత లక్ష్మమ్మ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.
చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు సాయంత్రం సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శంకరయ్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యుల రోదనల నడుము శంకరయ్య అంత్యక్రియలు జరిపారు. మృతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గంటల వ్యవధిలోనే భార్యభర్తలు మృతి చెందడంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.
గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మ, శంకరయ్య బతికిన అన్ని రోజులు చాలా అన్యోన్యంగా జీవించారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కష్ట సుఖాల్లో వారి తెగువ అందరకి ఆదర్శమంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామ హేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జీ బీర్ల అయిలయ్య, పలువురు ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఇవీ చదవండి: