యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం రైతాంగాన్ని మరోసారి కుదిపేసింది. ఓ పక్క కోతకు వచ్చిన ధాన్యం మడుల్లోనే నేలరాలగా, మరో పక్క కొనుగోలు కేంద్రాల్లో తూకానికి ఉంచిన ధాన్యం తడిసిపోయాయి.
గోరు చుట్టుపై రోకలి పోటులా ఇప్పటికే పలు పర్యాయాలు కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోగా, ఇప్పుడు కురిసిన వర్షం మరింత దెబ్బతీసింది. రాజపేటలో ఈదురుగాలుల కారణంగా మామిడి కాయలు నేలరాలాయి. ఈదురు గాలులకు యాదగిరి గుట్ట తులసీ కాటేజీలో ఉన్న పెద్ద వృక్షం విరిగి పడింది. కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.