యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన దుద్యాల శంకర్, దుద్యాల లలితలు గత 30 సంవత్సరాలుగా ప్రకృతి రంగులతో వస్త్రాలు తయారు చేస్తున్నారు. చెట్ల బెరడు, పూలు, ఆకులను ఎండబెట్టి రంగులు తయారు చేస్తారు. తాంబూలంలో వాడే కాచు నుంచి గోదుమ రంగు, ఎర్రచందనం నుంచి మిరప పండు రంగు, ఎండిపోయిన బంతి, కుసుమ, మోదుగు పూల నుంచి పసుపు రంగు, గోరింటాకు, గుంటకుంట్ల ఆకు నుంచి ఆకుపచ్చ, వేప, జామ ఆకుల నుంచి లేత ఆకుపచ్చ, జాఫ్రా, ఎర్రగుంట నుంచి కాషాయం, చెట్టు బెరడు చూర్ణం నుంచి కాఫీ రంగు, తంగేడు పువ్వు, నుంచి పసుపు రంగు తయారు చేస్తున్నారు.
రోజుల తరబడి...
రసాయనాలతో తయారైన రంగులను దారానికి అద్దడం చాలా సులువు. కానీ సహజసిద్ధమైన రంగులు అద్దాలంటే 21 రోజులు కష్టపడాలి. ముందుగా శుద్ధి చేసిన దారాన్ని ‘కరక్కాయ పొడి’ కలిపిన నీళ్లలో గంటసేపు నానబెడతారు. తర్వాత దారాన్ని ‘పటికపొడి’ కలిపిన వేడి నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెడతారు. ఇదే ప్రక్రియ నాలుగైదు పర్యాయాలు చేసిన తర్వాత ఆ దారానికి సహజరంగులు అద్దుతారు. అద్దకం పని పూర్తి కావడానికే 10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది. ఔషధగుణాలు పోకుండా అద్దకం ప్రక్రియ పూర్తిచేసి ఇక్కత్ డిజైన్లతో మగ్గాలపై చీరలు నేస్తున్నారు.
మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే..
సహజ సిద్ధమైన రంగులకంటే కృత్రిమ రంగులు అద్దిన బట్టలు కంటికి ఇంపుగా కనిపించడం వల్ల సహజరంగుల వస్త్రాలు కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా తక్కువే. తయారు చేసేవారి సంఖ్య అంతకన్నా తక్కువ. ఇలాంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరికొంత మంది సహజరంగుల అద్దకం పనిచేయడానికి ముందుకొస్తారని తయారీదారులు సూచిస్తున్నారు.
ఎన్నో ప్రయోజనాలు...
సహజరంగులు అద్దకం వల్ల చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే సహజ రంగులిచ్చే పదార్థాలకు ఔషధ గుణాలున్నందున ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. సహజరంగుల నూలు వస్త్రాలు ధరించిన వారికి అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఉంటుంది. శరీరానికి చలికాలంలో వేడిని, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే ఈ చేనేత వస్త్రాలకు సహజరంగుల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవీ చూడండి: గణాంకాల గారడి.. ప్రగతికి ప్రాతిపదికలేమిటి?