యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు.. తమ వ్యవసాయ భూముల్లో వైకుంఠధామం నిర్మిస్తున్నారంటూ బసంతాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబం నిరసనకు దిగింది. తమ పట్టా భూమిలో సర్పంచ్ అక్రమంగా వైకుంఠధామం నిర్మిస్తున్నారని రైతు గుల్లపల్లి లక్ష్మీ నరసయ్య కుటుంబ సభ్యులతో కలిసి రాజాపేట తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఆ భూమి తమకే చెందినట్టు పట్టా పుస్తకాలు చూపించినా.. నిర్మాణ పనులు ఆపడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వే నెంబర్ 137/బిలో ఉన్న 9 ఎకరాల మూడు గుంటల భూమిని గల్లపల్లి లక్ష్మీ నరసయ్య తల్లిదండ్రులు 1992లో ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి. అయితే.. తాజాగా గ్రామ సర్పంచ్ ఆ భూమిలో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. ఈ విషయమై రాజాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఎమ్మార్వో, ఎంపీడీవో, జిల్లా కలెక్టర్కు రాత పూర్వకంగా వినతి పత్రాలు సమర్పించిన చర్యలు తీసుకోలేదని రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పరిధిలో పోరంబోకు స్థలం ఉన్నప్పటికీ.. దాన్ని వదిలేసి తమ పట్టా భూమిలో వైకుంఠధామం కట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకే.. అక్కడ వైకుంఠ ధామం కడుతున్నామని సర్పంచ్ తెలిపారు. కుటుంబం మొత్త ఈ భూమిపై ఆధారపడి బతుకుతున్నామని.. వేరేచోట్ల తమకు భూములు కానీ.. ఆస్తులు కానీ లేవని.. దయచేసి తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. న్యాయం జరగని పక్షంలో కుటుంబమంతా సామూహికంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధమే అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : గొడవ ఆపేందుకు ప్రయత్నించబోతే.. లారీ కిందకు తోసేశారు!