యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని నూనె గూడెం గ్రామంలో వరిధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ.. గురువారం సాయంత్రం ఆ గ్రామానికి చెందిన రైతులు మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అందెం అరెడ్డి, మలిపెద్ది మధుసూదన్‌రెడ్డి, మచ్చి మణిశేఖర్‌రెడ్డి, మంథర్రెడ్డిలు ట్యాంక్‌పై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా గ్రామంలోని రైతులు గ్రామ పంచాయతీ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తె లిపారు.
గత రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు తూకం వేయక పోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుండాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్ సెంబర్ నిర్వాహణ బాధ్యతలను గ్రామ సర్పంచ్‌కి అప్పగించడంతో అతను తనకు ఇష్టం వచ్చిన రీతిలో సొంత వ్యాపారం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటి వరకు గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి నిర్వహించిన ధాన్యం కొనుగోలుపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఉన్న సుమారు 3500 బస్తాల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హమీతో రైతులు తమ నిరసనను విరమించారు.