యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చిన టీఎస్సీఏబీ వైస్ ఛైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి... రోజుల తరబడి కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంట మొలకెత్తుతోందని వాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పట్ల అధికారులు, నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పట్ల నిర్లక్ష్యం
రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. తడిసి మొలకెత్తిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. దీనిపై డీసీసీబీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని, ధాన్యం ఉత్పత్తిలో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
ఆందోళన వద్దు
గతంలో కేవలం 20 శాతం ధాన్యం ఉత్పత్తి అవగా... తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోటి పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అకాల వర్షాలతో మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. 10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మలరామారం ఎంపీపీ సుధీర్ రెడ్డి, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Registrations: సాంకేతిక సమస్య పరిష్కారం... ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు