రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు పెట్రోల్ బాటిల్ ముందు పెట్టుకొని ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు అవుతుందని.. ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్న ధాన్యంలో నూక ఎక్కువగా ఉందని... మిల్లర్లు తిప్పి పంపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి పోచంపల్లి యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు.
జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్కి ఫోన్లో పరిస్థితిని వివరించగా, స్పందించిన కలెక్టర్ మధ్యాహ్నం వరకు రైతులు, మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. విషయం తెలిసిన చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్, పోచంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మధ్యాహ్నం రైతులు, మిల్లర్లతో నిర్వహించనున్న సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు.
- ఇవీ చూడండి: 'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'