యాదాద్రి పుణ్యక్షేత్రం విద్యుద్దీపాలతో వెలుగులీనుతోంది. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నూతన ప్రధానాలయంలో నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తున్నారు. కొత్తగా పసుపు రంగు విద్యుద్దీపాలను ప్రయోగాత్మకంగా పరిశీలన చేశారు. వీటిని గత నాలుగు రోజులుగా వెలిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయోగాత్మక పరిశీలన కోసం వివిధ రకాల విద్యుద్దీపాలను అమర్చారు. కాకతీయ పిల్లర్లకు పసుపు రంగు విద్యుద్దీపాలను అమర్చి వెలిగించి పరిశీలించారు.
సీసం పోత పనులు..
ఆలయ ఆవరణలోని కృష్ణ శిలతో చేపట్టిన ఫ్లోరింగ్ బండలను అందంగా తీర్చిదిద్దేందుకు సీసంను కరిగించి బండల మధ్య నింపుతున్నారు. ఫలితంగా ఆలయ ఆవరణ ఆకర్షణీయంగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఆలయ తిరుమాడ వీధులు, రాజగోపురాల మధ్య భాగాలు, అద్దాల మండపం, అష్టభుజి మండపం ఆవరణలో ఈ పనులు కొనసాగుతున్నాయి.
మరిన్ని ఇత్తడి దర్శన వరుసలు..
యాదాద్రి సన్నిధికి మరిన్ని ఇత్తడి దర్శన వరుసలు చేరాయి. వీటిని కొలతలు తీసుకొని ఆలయానికి తరలించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గర్భాలయంలో దర్శన వరుసల వెడల్పు పెంపు విషయంలో ప్రత్యేకంగా మార్కింగ్ వేశారు. ఈ మార్కింగ్లపై దర్శన వరుసలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్