యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెంలో ఓ వృద్ధ జంటకు నాలుగేళ్ల క్రితం వరకు ఊరి మధ్యలో సొంత ఇల్లు ఉండేది. మరి ఇప్పుడు... సంచులు, ఫెక్సీలతో వేసుకున్న ఓ చిన్న గుడిసెలో ఉంటున్నారు. నిత్యం పురుగూ పుట్రల భయంతో కాలం వెల్లదీస్తున్నారు. వీళ్లు ఇప్పుడు ఇంత దీనస్థితిలో ఎందుకున్నారో తెలుసుకోవాలంటే... నాలుగేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే...
2017లో గ్రామంలో నూతన పంచాయతీ భవనం నిర్మాణం చేయాలని అప్పటి పాలక వర్గం నిర్ణయించుకుంది. దాని కోసం గ్రామం మధ్యలో ఉన్న స్థలమైతే బాగుంటుందనుకుంది. ఆ స్థలాన్ని పరిశీలించగా... అక్కడ బెక్కంటి మల్లయ్యకు చెందిన పెంకుటిల్లు ఉంది. ఆ ఇంట్లో వృద్ధులైన మల్లయ్య దంపతులు నివాసముంటున్నారు. పాలకవర్గం తీర్మానించుకుని వారికి మరో చోట ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ వృద్ధులు ఒప్పుకోగా... వెంటనే ఆ ఇల్లును కూల్చేశారు.
వృద్ధుల పూరిగుడిసె...
అప్పటి నుంచి ఆ వృద్ధ దంపతులు ఓ ఖాళీ స్థలంలో చిన్న గుడిసె వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. చలికి వణుకూ.. వర్షానికి తడుస్తూ.. ఎండను భరిస్తూ... జీవనం సాగిస్తున్నారు. పగలంతా పొట్టకూటి కోసం ఇబ్బంది పడుతుంటే... రాత్రిళ్లు మాత్రం ఎప్పుడు పొద్దు పొడుస్తుందా అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా నాలుగేళ్లు గడుస్తోంది. గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం పునాది తీసిందీ లేదు... ఈ వృద్ధుల ఇల్లు కోసం ముగ్గుపోసిందీ లేదు. ఆ వృద్ధ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే కావటం... వారి తరఫున అడిగేవారు లేకపోవడం వల్ల పాలకవర్గం పట్టించుకున్న పాపాన పోలేదు.

"ఉన్న ఒక్క ఇల్లును కూల్చేశిండ్రు. నిల్వ నీడ లేకుండా చేశిండ్రు. పండుగలకు కట్టిన ఫ్లెక్సీలు, పాత సంచులతోనే గుడిసెసుకున్నం. మా ముసలాయనకు కండ్లు సక్కగ కన్పియ్యయి. రోజూ పాములు, తేళ్లు, కుక్కలతో భయపడుకుంటనే బతుకుతున్నం. మమ్ముల్ని పట్టించుకునెటోళ్లే లేరు. నెల నెల వచ్చే ఫించనే మాకు ఆధారం. పెద్ద మనుషుల చుట్టు ఎన్నిసార్లు తిరిగినా మాకు తెల్వదంటుండ్రు." అంటూ కన్నీళ్లతో తమ గోస వెళ్లబోసుకుంటున్నారు.
గుడిసెలో వృద్ధుల భారమైన జీవనానికి అద్ధం...
గత సర్పంచ్ ముక్కెర్ల నర్సింహ, ప్రస్తుత సర్పంచ్ వెలుగు శోభ సోమయ్యలను వివరణ కోరగా... గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి వృద్ధ దంపతుల స్థలాన్ని వారి అనుమతితోనే తీసుకున్నామని తెలిపారు. ప్రతిపాదిత నూతన గ్రామ పంచాయతీ భవన పరివాహక స్థానికుల అభ్యంతరాలతో పనులు ఇంకా చేపట్టలేదన్నారు. బాధిత వృద్ధ దంపతుల విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు.
ఏది ఎలా ఉన్న వృద్ధ దంపతుల విషయంలో ఇప్పటికే పాలకవర్గం ఓ నిర్ణయం తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ తరఫున పక్కా ఇల్లు కట్టించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.