యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నారసింహుని నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, అష్టోత్తరం వంటి పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ధర్మదర్శనానికి 2 గంటలు
కొండకింద వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు 2 గంటలు... ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఉదయం నుంచి స్వామి వారి ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.
ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు
కుటుంబ సమేతంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు యాదాద్రికి చేరుకుని... బాలాలయంను సందర్శించారు. స్వామి వారిని దర్శించుకొని... మొక్కులు చెల్లించుకున్నారు. సువర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఎర్రబెల్లికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేసి... లడ్డూ ప్రసాదం అందజేశారు. మంత్రి పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాత్రి యాదాద్రిలోనే బస చేశారు.
యాదాద్రిలో హైకోర్టు చీఫ్ జస్టిస్
యాదాద్రీశుడి సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీకి ఆలయ ఈవో గీతారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు ఒక అరగంట పాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు. కొండ పైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. భక్తులు కాలినడకన కొండపైకి చేరుకొని కాస్త ఇబ్బందులు పడ్డారు. చీఫ్ జస్టిస్‌తో పాటు ఆలయ ఈవో గీతారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మేజర్ జనరల్ ప్రత్యేక పూజలు
లక్ష్మీనరసింహ స్వామిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సబ్ ఏరియా, మేజర్ జనరల్ ఆర్కే సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి... ప్రత్యేక ఆశీర్వచనాలు, లడ్డూ ప్రసాదం అందజేశారు. ప్రధానాలయం పునర్నిర్మాణం పనులను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేజర్ జనరల్‌కి అక్కడే ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వాగతం పలికారు.
శరవేగంగా పునర్నిర్మాణ పనులు
రాష్ట్రానికే వన్నె చేకూర్చే తరహాలో రూపొందుతున్న శ్రీ లక్ష్మీనృసింహుని క్షేత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటించి దిశానిర్దేశం చేయడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయం పునర్నిర్మాణం పూర్తికావొచ్చింది. ఉత్తరదిశ పనులు గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో పనులను మరింత వేగవంతం చేశారు. వీఐపీల కోసం ఏర్పాటు అవుతున్న లిఫ్ట్ ప్రవేశ మార్గంలో స్వాగత తోరణం నిర్మితమవుతోంది. సదరు తోరణానికి హైందవ సంస్కృతిని చాటే చిహ్నాలు, స్వామి వారి రూపాన్ని పొందుపరుస్తున్నారు. కళాత్మకంగా ఆధ్యాత్మికత ఉట్టిపడే తీరులో ఆ పనులను నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: