Darshans Dandha In Yadadri Temple: యాదాద్రి ఆలయ పునః ప్రారంభం అనంతరం స్వయంభువులను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో యాదాద్రికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయంలో దర్శన సంప్రదాయాల్ని విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. కొందరు దొడ్డిదారిన పైరవీలు చేసి దర్శనాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శనంతో పాటు ఆలయంలో కూర్చొనే భాగ్యం, అష్టోత్తరం, ఆశీర్వచనం వంటివి చేయిస్తూ సాధారణ భక్తుల దర్శనాలను ఆలస్యం చేయిస్తున్నారని సామాన్య భక్తజనం వాపోతున్నారు.
రాజకీయాలు, స్థానికత, సిబ్బంది చేతివాటం ప్రొటోకాల్ అంటూ భిన్న పద్ధతిలో దర్శనాలు చేయడం సాధారణ భక్తులకు ఇబ్బందికరంగా మారింది. కొందరు స్థిరాస్తి వ్యాపారులు తమ కస్టమర్లను క్యూలైన్లలో నిల్చోకుండానే రాచమార్గంలో దర్శనం చేయిస్తున్నారని, వారికి కొందరు ఆలయ అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పేర్లు ఉపయోగించుకుని మరికొందరు దైవదర్శనానికి వెళుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ దర్శనాలు శుభపరిణామమే అయినప్పటికీ.. దొడ్డి దారి దర్శనాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు కోరుతున్నారు.
దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం: మరోవైపు పవిత్ర కార్తిక మాసంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. కొండ కింద నూతన వ్రత మండపంలో ప్రతి రోజు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తున్నారు. 21,480 దంపతులు శ్రీ సత్యనారాయణస్వామి వ్రత పూజలు ఆచరించారు. మొత్తం 23 రోజుల్లో వివిధ విభాగాలు కలుపుకొని రూ.14,66,38,097 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు.
గత ఏడాది 19,176 వ్రత పూజలు నిర్వహించగా.. వివిధ విభాగాలు కలుపుకొని మొత్తం రూ. 7,35,10,307 ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత మాసం రూ.7,31,27,790 ఆదాయం అదనంగా సమకూరింది.
ఇవీ చదవండి: కార్తికమాసం స్పెషల్.. యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం
నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
ట్రైన్ ఇంజిన్నే ఎత్తుకెళ్లిన దొంగలు.. సొరంగం తవ్వి మరీ చోరీ!