యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధానాలయం ఎదుట నిర్మించిన బ్రహ్మోత్సవ మండపం కింద ఒకవైపు పగుళ్లు వచ్చి ఫ్లోరింగ్ బండలు కిందకు కుంగాయి. భద్రాచలంలోని బ్రహ్మోత్సవ మండపం మాదిరిగానే యాదాద్రిలోనూ ఉండాలనే లక్ష్యంతో సుమారు రూ.2.75 కోట్లతో కృష్ణ శిలలతో అష్టభుజి ఆకారంలో ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. స్తంభాలను ఆకర్షణీయంగా చెక్కించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండపానికి ఉత్తరం వైపు పగుళ్లు వచ్చాయి. ప్రధానాలయ నిర్మాణంలో నాణ్యత పరిశీలించడానికి క్వాలిటీ కంట్రోల్ బోర్డు సీఈ ఆశారాణి గురువారం ఇక్కడకు వచ్చినా ఈ పగుళ్లను పరిశీలించలేదు. ఈ మండపం చుట్టూ వర్షపునీరు పోవడానికి భూగర్భ డ్రైనేజీ వేశామని, అందువల్ల ఫ్లోరింగ్‌కు పగుళ్లు వచ్చాయని వైటీడీఏ ఈఈ వసంతనాయక్ తెలిపారు. అడుగుభాగంలో మరమ్మతులు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!