యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఆత్మకూరు మండలంలో ఏకంగా మూడు కరోనా పాజిటివ్ కేసుల నమోదుతో మండల వాసులు భయాందోళనలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆనందంగా ఉన్న తరుణంలో గత మూడు రోజుల క్రితం 14 మంది ముంబయి నుంచి ఆత్మకూరుకు తరలివచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు లక్షణాలు ఉన్న నలుగురిని కరోనా పరీక్షలకు పంపారు.
ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్...
అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పాజిటివ్ నిర్థరణ అయ్యిందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అప్రమత్తమైన అధికారులు బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని వెతికి హోం క్వారంటైన్ చేశారు. మిగిలిన వారిలో ఐదుగురిని హైదరాబాద్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. గ్రామాన్ని హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేయించారు. గ్రామమంతా బ్లీచింగ్ వెదజల్లారు. గ్రామంలోకి ఇతరులెవరూ రాకుండా రహదారులకు అడ్డంగా ముళ్ల కంపను వేశారు. క్వారంటైన్‌కు తరలించిన వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారనే విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు.