యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పాదయాత్ర ప్రారంభిన కాంట్రాక్ట్ లెక్చరర్లను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేసి, స్వస్థలాలకు బదిలీ చేయటంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు.
మధ్యలో పోలీసులు వీరిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అరెస్టులను నిరసిస్తూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు నిరసనకు దిగారు. తమ డిమాండ్లు సీఎం కేసీఆర్కు చేరే విధంగా శాంతియుత వాతావరణంలో యాదగిరిగుట్ట నుంచి మొదలుపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యంలో ఉన్నామా.? అని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వ తీరును ఖండించారు. 13 ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తూ పిల్లలకు దూరంగా ఉన్న తమను స్వస్థలాలకు బదిలీ చేయాలన్నారు.
బదిలీల కోసం మంత్రుల చుట్టూ గత మూడేళ్లుగా తిరుగుతున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్లు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తమ సమస్యలు సీఎం కేసీఆర్కు తెలియజేయాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్టలో పాదయాత్ర ప్రారంభించామని కాంట్రాక్ట్ లెక్చరర్లు తెలిపారు.
ఇదీ చదవండి: వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన