యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆస్తుల నమోదు సర్వేను జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె అన్నారు. ఆస్తుల వివరాల నమోదును నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. సర్వేను పారదర్శకంగా చేపట్టాలని, ఎప్పటికప్పుడు వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.
స్థానికులతో చర్చ:
స్థానిక ప్రజలతో సర్వే వివరాలపై కలెక్టర్ మాట్లాడారు. సిబ్బంది ఏయే వివరాలు అడుగుతున్నారని ఇళ్ల యజమానులతో చర్చించారు. వివరాల సేకరణలో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే సహాయకేంద్రాన్ని సంప్రదించాలన్నారు. నమోదుచేసిన వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జంపాల రజిత, ఛైర్మన్ సుధా, సిబ్బంది పాల్గొన్నారు.