యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పనులను సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన సూచనల మేరకు స్థపతులు, డిప్యూటి స్థపతులు,శిల్పులు, తుది మెరుగులు దిద్దుతున్నారు. మండపం పైభాగంలోని స్లాబ్లకు డంగు సున్నంతో పనులు చేపడుతున్నారు. ప్రధాన ఆలయ బయటి ప్రాకారంలోని చాలా సాలహారాల్లో విగ్రహాలను అమర్చే పనులు చేస్తున్నారు, పక్కనే ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో కళ్యాణ మండప పనుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయం చుట్టూ దిద్దుబాటు చర్యలు..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా, ఇటీవల కాలంలో నాణ్యత లోపంతో పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తూర్పు రాజగోపురం సమీపంలోని బ్రహ్మోత్సవ మండపం వద్ద, పడమటి రాజ గోపురం వద్ద, వేంచేపు మండపం వద్ద ఇటీవల కాలంలో కృష్ణశిలతో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఇతర సమస్యలు ఎదురు కాకుండా, టెక్నికల్ కమిటీ సభ్యుల సూచనలతో, దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆలయం చుట్టూ, ప్రాకారం అంతా గట్టిపడే విధంగా పనులు చేస్తున్నారు, బోర్ వేసే భారీ మిషన్లతో ఐదు మీటర్ల నుంచి పది మీటర్ల మధ్యలో, ఆలయం చుట్టూ సుమారు ఎనిమిది ఫీట్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, అందులో నుంచి సిమెంట్ కాంక్రీట్ వేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు, నిర్మాణ సంబంధ సమస్యలు ఎదురుకాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రసాదం తయారు చేసే భవనం స్లాబ్ పై సుమారు మూడు ఇంచులతో సిమెంట్ పనులు చేస్తున్నారు. వర్షాల కారణంగా క్యూ కాంప్లెక్స్‌లో వర్షపు నీళ్లు లీకయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ప్రసాదం తయారీ భవనంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిమెంట్ పనులు చేస్తున్నారు.
శరవేగంగా మరమ్మతులు.
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా, ప్రధానాలయం వద్ద సాయిల్ స్టెబిలైజేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి ప్రధానాలయం ఎదుట బ్రహ్మోత్సవ మండపం వద్ద, వెనుక భాగంలో మండపం వద్ద వేసిన ఫ్లోరింగ్ కుంగిపోవడం తో ఐటీడీఏ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు, ఇక్కడ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సాయిల్ స్టెబిలైజేషన్ ద్వారా పనులు చేస్తున్నారు. బోర్వెల్ సహాయంతో ఫ్లోరింగ్‌పై రంద్రాలు చేసి అందులో ఇనుప రాడ్లు పెట్టి సిమెంట్ కాంక్రీట్ చేస్తున్నారు.
ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల