పట్టుదల, కృషి ఉంటే దేన్నైనా సాధించొచ్చు అనడానకి చంద్రకాంత్‌సాగర్ జీవితం సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే చేతివేళ్లు మాత్రమే కదిలించగలిగే అంగ వైకల్యం నాణానికి ఒకవైపు ఐతే.. కంపెనీ పంపిణీదారునిగా మొదలై సంవత్సరానికి రూ.40 లక్షలు వచ్చేలా వ్యాపారం సాగించే ఎత్తుకు ఎదిగిన తీరు మరోవైపు. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన నిరంజన్‌సాగర్, అంజలీదేవిల కుమారుడు చంద్రకాంత్‌సాగర్(35). ఆయనకు పుట్టుకతోనే 90 శాతం అంగవైకల్యం ఉంది. వైద్య నిపుణులు జన్యుపరమైన లోపమని.. చికిత్స ఏమి ఉండదని చెప్పారు. ఈ విషయం విన్న తల్లిదండ్రులు కొంత కాలం బాధపడినా.. తరవాత మనోధైర్యం తెచ్చుకున్నారు.
ఆయనకు చదువుపై ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రలు ప్రోత్సహించారు. 2003లో పదో తరగతి వేగేశ్న పద్మావతి పాఠశాలలో దివ్యాంగుల ఆశ్రమంలో చదువుకొని పూర్తి చేశారు. అనంతరం కాలేజ్‌లో దివ్యాంగులకు ప్రత్యేక కళాశాలలు లేకపోవడంతో ఇంట్లోనే ట్యూటర్ని నియమించుకుని వేళ్ల కదలికలతో కంప్యూటర్ బేసిక్స్, యానిమేషన్ నేర్చుకున్నారు. ఆయన ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చాలా ప్రయత్నాలు చేశారు. 23 సంవత్సరాలు వచ్చినప్పుడు ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఉత్పత్తులకు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల నిల్వదారుడిగా, పంపిణీదారుడిగా చేరారు.
2019 సొంతంగా పరిశ్రమ ఏర్పాటు: కొంతమంది వ్యక్తులను నియమించుకుని 2018 వరకు ఆ వ్యాపారం కొనసాగించారు. సంవత్సరానికి రూ.40 లక్షల వరకు టర్నోవర్ వచ్చేది. తనలాంటి దివ్యాంగులకు ఉపాధి కల్పించడం కోసం ఇంకా ఏదో చేయాలని అనుకునే వారు. పర్యావరణహిత సంచులు, సర్జికల్ మాస్కులు, బెడ్ స్ప్రెడ్‌లు తయారీకి 2019లో కాటేదాన్‌లో షెడ్డును లీజుకు తీసుకున్నారు. ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో కంపెనీ పెట్టారు. ఇందులో కొందరు దివ్యాంగులకు పని చేసే అవకాశం ఇచ్చారు.
అవార్డులు: 2021లో ఈయన పరిశ్రమకు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ '2021 సంవత్సరానికి బెస్ట్ ఇండస్ట్రీ, మార్గదర్శి పురస్కారం' ఇచ్చి సత్కరించింది. రామోజీ గ్రూపునకు సంబంధించిన మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అవార్డును స్పాన్సర్ చేసింది. లతారాజా ఫౌండేషన్ స్పోర్టివ్ పర్సన్, పద్మావతి సంస్థ స్ఫూర్తి పురస్కారం, యాక్ట్ సంస్థ అబ్దుల్‌కలాం అవార్డులతో చంద్రకాంత్ అవార్డులు వచ్చాయి.
సాయం చేసిన ప్రభుత్వం: తన పరిశ్రమను మరింత విస్తరించేందుకు సహాయం చేయాలని చంద్రకాంత్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించి పరిశ్రమ పెట్టుకునేందుకు స్ధలం కేటాయించారు. కెనరా బ్యాంకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.50 లక్షల రుణం మంజూరు చేసింది. ప్రస్తుతం అక్కడ పరిశ్రమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి: