కాంగ్రెస్ నుంచి తనను వెళ్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపపించారు. దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 10 నిమిషాల పాటు అమిత్‌షాతో భేటీ అయిన వెంకటరెడ్డి... ఇటీవల వర్షాలకు నియోజకవర్గంలో జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మునుగోడులో పార్టీ సమావేశం నిర్వహించే ముందు కనీసం స్థానిక ఎంపీ కూడా సమాచారం ఇవ్వారా...? అని ఆయన ప్రశ్నించారు.
ఆయన పీసీసీ అధ్యక్షుడా... 34ఏళ్లగా కాంగ్రెస్ కోసం కృషి చేశానని ... పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఎంపీగా పోటీ చేస్తే తనను ఓడించేందుకు పని చేసిన చెరుకు సుధాకర్ పార్టీలో చేరే విషయాన్ని కూడా చెప్పకపోవటం ఏంటని ఆయన రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి... తమ లాంటి సీనియర్ నేతలను పార్టీ నుంచి పంపించి కొత్త వ్యక్తులకు టికెట్లు ఇచ్చేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో లీకులు ఇచ్చి తాను పార్టీ మారుతున్నానని మానసికంగా వేధిస్తున్నారని వెల్లడించారు. వచ్చే మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లు చాలా తెలివైన వారని సరైన అభ్యర్థినే ఎన్నుకుంటారని జోస్యం చెప్పారు. 34 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి స్టార్ క్యాంపెయిన్...? మూడేళ్ల కిందట వచ్చిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడా అంటూ పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించారు.
పిచ్చి ఆలోచనలు మానుకో రేవంత్: దాసోజు శ్రావణ్ లాంటి మేధావిని వెళ్లగొట్టడంలో కూడా కుట్ర ఉందని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు తేదీలు ప్రకటించి ప్రచారం చేయాలంటే చేయడం కుదరదని మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్దనే వీళ్ల సంగతి తేల్చుకుంటా అని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు ఎలా ప్రకటిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
క్షమాపణలు చెప్పాల్సిందే.. కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదని ఎద్దేవ చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకుముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు.
'నేను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్ నోటీసులు ఇస్తా. నేను నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్‌కు రాలేదు. 35 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే పని చేస్తున్నా. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశా. సోనియా గాంధీ నన్ను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు.' - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
అది ఆయన్నే అడగండి: ఇన్నాళ్లు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి శత్రువులతో కలిసి వెన్నుపోటు పొడిచారంటూ ఇటీవలె పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. సోదరుడు రాజగోపాల్‌రెడ్డితో తనను కలిపి.. ఇద్దరికీ ఆ వ్యాఖ్యలు వర్తించేలా ‘మీరు’ అని అన్నందుకు క్షమాపణలు చెప్పాలని బుధవారం పేర్కొన్నారు. సోదరుడి పార్టీ ఫిరాయింపు గురించి అడగ్గా.. రాజగోపాల్‌రెడ్డి భాజపాలోకి ఎందుకు వెళ్తున్నారన్నది ఆయన్నే అడగాలని అన్నారు.
ఇవీ చూడండి.. Revanth Reddy : 'నా మాటలకు వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు'