Funds Problem for BB Nagar AIIMS: ఎయిమ్స్ అనగా ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ. అత్యుత్తమ వైద్యనిపుణులు, అంకితభావంతో పనిచేసే సిబ్బంది, ఏమాత్రం విదేశాలకు తీసిపోని మౌలిక వసతులకు నెలవు. పేదవాడి నుంచి మొదలుకొని రాష్ట్రపతి వరకు ఎవరు అనారోగ్యం పాలైనా తొలి ఎంపిక ఎయిమ్స్ అనడంలో సందేహం లేదు. అలాంటి సకల వసతులు ఉన్న ఎయిమ్స్ రాష్ట్రానికి మంజూరు కావడంతో ప్రజలు ఎంతో సంతోషించారు. ఇందుకోసం భాగ్యనగరానికి అతి సమీపంలోని బీబీనగర్‌ను ఎంపిక చేయడంతో తమకు ఉత్తమ వైద్య సేవలు అందుతాయని అంతా ఆశించారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. 2019లో ప్రారంభమైనా ఇప్పటివరకు ఎయిమ్స్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదు.
తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం శీతకన్నేసింది. బీబీనగర్‌కు భారీగా నిధులు కేటాయించినా ఇప్పటి వరకు అరకొరగానే నిధులు విడుదల చేసింది. దీంతో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి కాలేదు. దేశంలో 2014 తర్వాత మంజూరైన ఎయిమ్స్‌లలో తెలంగాణకే అతి తక్కువగా నిధులు వచ్చాయని తాజాగా మరోసారి ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ)కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఎయిమ్స్ ప్రాజెక్టుల స్థితిగతుల గురించి విజయవాడకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద పెట్టుకున్న ఆర్జీ కింద దేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సంస్థలకు విడుదల చేసిన నిధుల వివరాలు సదరు వ్యక్తికి వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌కి సంబంధించి కేంద్రం మంజూరు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల మూడు నెలలు కాగా, తొలుత రూ.1028 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. 2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక ఆమోదించారు. కానీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేయటంతో ప్రస్తుతం నిర్మాణ వ్యయం రూ.1365.95 కోట్లకు చేరింది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 156.01 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా 1209 కోట్లు అంటే దాదాపు 90% నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది 2024 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపింది.
మూడేళ్ల నుంచి ఓపి సేవలు, వైద్య కళాశాల బీబీనగర్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్నాయి. 8% నిధుల విడుదలకు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టినప్పుడు, ఏడాదిన్నరలో మొత్తం నిధులు విడుదల చేసి బీబీనగర్ ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం కొంత కష్టమే. ప్రధానంగా హైదరాబాద్ శివారులో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షలాదిమంది గ్రామీణ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన అత్యాధునిక వైద్య సౌకర్యాలు బీబీనగర్ ఏమ్స్ ఏర్పాటుతో తొలగిపోతాయనుకున్నారు. కానీ మరింతకాలం వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది.
ఇవీ చదవండి: