ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి పట్టుమని పది ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామచంద్రపురంలో వంద మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు భాజపాలో చేరారు.వారికి పీవీ శ్యాంసుందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీని 2023లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డీఎస్సీని ప్రభుత్వం ఇప్పటివరకు వేయలేదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని ఆయన విమర్శించారు.
అక్రమ స్థలాలంటూ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్లు సరిగా లేవని... స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభిస్తుంటే 10 లక్షల జనాభా ఉన్న ఈ నియోజకవర్గానికి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒక్క వెంటిలేటర్ కూడా లేదన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తుండగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఎక్కడా సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు.
ఇవీ చూడండి: 'అప్పుడు మీరు చేస్తే ఒప్పు... ఇప్పుడు మేము చేస్తే తప్పా?'