వంట గ్యాస్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కలవరపడుతున్నారు. పెరుగుతున్న గ్యాస్ ధరలను నియంత్రించాలని వరంగల్ జిల్లాలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ వినియోగం మోయలేని భారంగా మారిందని వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 2,92,490 మంది వినియోగదారులు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండగా... మొత్తం 15ఏజెన్సీల ద్వారా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుంది. అయితే గడిచిన ఆరు నెలలుగా పెరుగుతున్న గ్యాస్ ధరలు మహిళలకు పెనుభారంగా మారాయి. నిత్యావసరాల్లో ప్రధానమైన వంట గ్యాస్ ప్రస్తుతం డెలివరీ ఛార్జ్‌తో కలిపి వెయ్యి రూపాయలు చేరింది. దాంతో ప్రజలు గ్యాస్ వాడాలంటేనే జంకుతున్నారు. అధిక రెట్లపై ముఖ్యంగా మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలను వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
పండగల సమయాల్లో ఎక్కువ సంఖ్యలో సరఫరా అయ్యే గ్యాస్ సిలండర్లు... అధిక ధరల కారణంగా తక్కువ అవుతున్నాయని వంట గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. గతంతో పోలిస్తే గడిచిన ఆరు నెలలుగా గ్రామాల్లో వినియోగం తగ్గిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్ విషయంలో స్పందించి ధరలను నియంత్రించి పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయాలని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుకింగ్‌లు చాలా వరకు తగ్గడంతో ఏజెన్సీలు నిర్వహించలేని పరిస్థితి ఉత్పన్నమవుతుందని వాపోతున్నారు.
మహిళల కష్టాలు తీరుస్తామన్నారు. ఇంటింటికి వంట గ్యాస్ ఇస్తామన్నారు. రూ. 600 నుంచి ధరలు పెంచడం మెుదలెట్టారు. ఇప్పుడు వెయ్యి అయింది. వెయ్యి నుంచి రూ.1100 అవుతుంది.మేము కట్టెల పొయ్యిలు వాడేవాళ్లం. మాకు ఇప్పుడు గ్యాస్ అలవాటు చేశారు. ధరలు పెరగడంతో ఇటు గ్యాస్ వాడలేక పోతున్నాం. అటు కట్టెలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏంటో మాకేం.. అర్థం కావడంలేదు. మీ గ్యాస్‌లు మీరు తీసుకోండి. మా బాధలు ఇక తీరవు. -భ్రమరాంబ, గృహిణి
గ్యాస్ సిలండర్ ధరలు అధికంగా కావడంతో గత రెండు నెలలుగా గ్యాస్ బుకింగ్‌లు చాలా వరకు తగ్గాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్ విషయంలో స్పందించి ధరలను నియంత్రించాలి. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయాలి. గ్యాస్ బుకింగ్‌లు తగ్గడంతో ఏజెన్సీలు నిర్వహించలేకపోతున్నాం.- తుమ్మల శ్రీధర్, ఏజెన్సీ నిర్వాహకుడు
ఇదీ చదవండి: Harish Rao Paddy: 'ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నుంచి సహకారం లేదు'