వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్లో టీబీ నియంత్రణ అధికారులతో పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వ్యాధి నివారణకు అధికారులు చేపట్టిన చర్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి సేవల్లో మెరుగు పడని పక్షంలో ఉపేక్షించేది లేదన్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో గుర్తించిన రోగుల వివరాలను ప్రతిరోజు నిక్షయ పోర్టల్లో సాయంత్రంలోగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సమాచారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి మందులు ఉచితంగా అందించటంతో పాటుగా చికిత్స కాలం పూర్తయ్యే వరకు నెలకు 500 రూపాయలు నేరుగా రోగి ఖాతాలో జమవుతాయని వెల్లడించారు.