Warangal Accident News : వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సును, ఓ డీసీఎం వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిలోడుతో తొర్రూర్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం.. ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం నడుపుతున్న డ్రైవర్ రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదే వాహనంలో ఉన్న నలుగురు మహిళలు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరంతా క్యాబిన్‌లో ఇరుక్కుపోయి.. గంట పాటు నరకయాతన అనుభవించారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. అతికష్టం మీద మహిళలను బయటికి తీసి చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
డీసీఎం అతివేగంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు. రెండు భారీ వాహనాలు ఢీకొనడంతో వాహనదారులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. గాయపడ్డ వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న వర్ధన్నపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Road Accident in Shamirpet : మరోవైపు హైదరాబాద్‌లో కూడా ఘోర రోడ్డు ప్రమాదం వెలుగుచూసింది. ఈ విషాధ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృత్యవాత పడ్డారు. శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘట్‌కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న లారీ ఉన్నట్టుండి ఒక్కసారిగా అదుపు తప్పి.. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఇదే సమయంలో వెనక నుంచి వస్తున్న బొలెరో వాహనం, కారు లారీని ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా.. అందులోని ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ క్రమంలోనే లారీలో ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు వేగంగా కారు ఢీకొనటంతో డివైడర్‌పైకి దూసుకెళ్లింది. కారులో ఉన్నవారు గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి :