వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు వైద్య సిబ్బంది. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఎంజీఎంకు రాగా.. ఐదు గంటలుగా ఆరుబయటే ఉంచారు. రోగులను అడ్మిట్ చేసుకునేందుకు సాకులు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వచ్చినా... ఏమి చేయాలో తెలియక రోగి బంధువులు కొవిడ్ విభాగం వద్ద నిస్సహాయులుగా ఉండిపోయారు. ఓపీ విషయంపై ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారిని వివరణ కోరగా... స్పందించిన సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి వెంటనే అడ్మిట్ చేసుకుని చికిత్సను అందించారు.