వరదనీటి ముప్పును అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. నగరంలో భారీ వర్షంతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మేయర్ గుండు సుధారాణి పర్యటించారు. ఎనుమాముల మార్కెట్ సమీపంలోని సాయిగణేశ్ కాలనీ వాసులు... వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోందంటూ తమ ఇబ్బందులను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. జేసీబీల సాయంతో... కాలువల్లోని చెత్తా చెదారం తొలగించి వర్షపునీరు సరిగా పోయేలా అప్పటికప్పుడు మేయర్ చర్యలు చేపట్టారు.
అన్ని డివిజన్లలోనూ జేసీబీల సాయంతో వర్షపు నీరు వెళ్లిపోయేలా చేస్తున్నామని అన్నారు. ప్రజలెవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించి ముందుకెళుతున్నామని మేయర్ చెప్పారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా కొన్ని పనులు నెమ్మదించాయని పేర్కొన్నారు. అవి కూడా పూర్తయితే నగరానికి వరద ముప్పు ఉండదని మేయర్ వెల్లడించారు.