వరంగల్ అర్బన్ జిల్లాలో ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఆస్తుల వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని.. అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 32వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ఆయన పర్యటించారు. పలువురు ఇంటి యజమానుల నుంచి ఆయన ఆస్తి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. ప్రజల ఆస్తులపై హక్కులతోపాటు.. వాటికి భద్రత కల్పించడానికే ప్రతి కుటుంబానికి చెందిన ఆస్తి వివరాలు, నిర్మాణాలను నమోదు చేస్తున్నామని ఆయన ప్రజలకు తెలిపారు. ఆస్తులు, కుటుంబ సభ్యుల వివరాల విషయంలో నిజమే చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.
అక్టోబర్ 15వ తేదీ లోగా గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలోని నిర్మాణాల నమోదు తప్పులకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధరణి యాప్ ఆస్తుల వివరాల నమోదులో ఇంటి యజమానుల నుంచి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ కచ్చితంగా తీసుకోవాలన్నారు. ఒకవేళ యజమాని చనిపోతే.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా అతని వారసుల పేరుమీద మ్యూటేషన్ చేయాలన్నారు. బల్దియా అధికారులు, సిబ్బంది అంకిత భావంతో ఈ నెల 15లోగా ఆస్తుల వివరాలు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.