కూరగాయలే అమ్మవారికి బంగారు ఆభరణాలయ్యాయి. 1250 కేజీల కూరగాయలతో వరంగల్ భద్రకాళి అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి అమ్మవారి శాకంబరీ విశ్వరూప దర్శనం భక్తులను విశేషంగా అలరించింది. బెండ, బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, క్యాబేజీ, పండ్లు, ఆకుకూరలు ఇలా 72 రకాలతో 1250 కేజీల మేర అమ్మవారి అలంకరణ కోసం వినియోగించారు.
గతంలో సికింద్రాబాద్, ఇతర మార్కెట్ల నుంచి కూరగాయలను తెచ్చే అర్చకులు... ఈసారి పూర్తిగా సేంద్రియ కూరగాయలతో అలంకరణ చేశారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లోని తోటలకు వెళ్లి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తెచ్చి కన్నులపండువగా అలంకరించారు. కరవు,కాటకాలు లేకుండా అందరినీ చల్లగా చూసేందుకు... అమ్మవారు శాకంబరీగా భక్తుల చేత పూజలందుకుంటోంది.
భద్రకాళి శాకంబరీ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. తోపులాటలు జరగకుండా అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలతో దర్శనాలు ఏర్పాటు చేసినా క్యూలైన్లలో భక్తులు ఎక్కడా భౌతిక దూరం పాటించలేదు.
ఇదీ చదవండి: WEATHER REPORT: రాష్ట్రంలో రాగల మూడురోజులు ఆ జిల్లాల్లో వర్షాలే!