Vigilance and Enforcement Inspect Kaleshwaram Project on Third Day : కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు, నేడు కూడా జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ప్రాజెక్టు కార్యాలయాల్లో విలువైన పత్రాలు, రికార్డులను అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకుంటున్నారు.
Kaleshwaram Project in Telangana : గత రాత్రి కూడా మేడిగడ్డ(Medigadda) అతిథి గృహంలోనే బస చేసిన అధికారులు ఈ ఉదయం తిరిగి మహదేవ్ పూర్ నీటి పారుదల శాఖ కార్యాలయానికి విచ్చేసి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం పది మంది పాల్గొన్నారు. కాళేశ్వరం పంప్ హౌజ్(Kaleshwaram Pump House), మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాలు, సామర్థ్యానికి సంబంధించిన దస్త్రాలు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు మొదలైన అంశాలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా ఓ మినీ ట్రక్కు సరిపడా దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రంతో తనిఖీలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.
హైదరాబాద్‌కు కీలక దస్త్రాలు తరలింపు : ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుని, హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. మూడు రోజులపాటు సుదీర్ఘంగా సాగిన సోదాల్లో అధికారుల బృందం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లకు చెందిన కీలక పత్రాలు జప్తు చేశారు. పది మంది తనిఖీల్లో కాళేశ్వరం పంపుహౌజ్, మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణాలు, సామర్థ్యానికి సంబంధించిన దస్త్రాలు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు మొదలైన అంశాలకు చెందిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రమేశ్ వెల్లడించారు.
అప్పటిదాక కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు - రేవంత్ సర్కార్ ఆదేశాలు
కాళేశ్వరంపై ప్రభుత్వం దృష్టి : కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. లక్ష కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పారు. అధికారంలోకి రాగేనే ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షలతో బిజీబిజీగా ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో బ్యారేజీ భవిష్యత్తునే ప్రశ్నార్ధకంగా మారింది. గత నెల 29న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) నేతృత్వంలో మంత్రుల బృందం బ్యారేజీని సందర్శించి, కాళేశ్వరాన్ని అక్రమాల పుట్టగా అభివర్ణించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతి నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణకు ఆదేశించేందుకు సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి.
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల సోదాలు
ఏంటీ! కాళేశ్వరం బ్యారేజీల్లో లోపాలను మూడేళ్ల క్రితమే గుర్తించారా! ముందే హెచ్చరించినా పట్టించుకోలేదా!