ఛలో మల్లారానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో... ఇటీవల జరిగిన ఎస్సీ యువకుడి హత్య, ఎస్సీలపై అత్యాచారాలు, దాడులను నిరసిస్తూ... కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఛలో మల్లారానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్ నుంచి మల్లారానికి బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని జనగామ వద్ద పోలీసులు అడ్డుకుని... లింగాల ఘన్‌పురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను జనగామ వద్ద అడ్డుకున్న పోలీసులు... రఘనాథపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్కను... హన్మకొండలో గృహనిర్బంధం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి జిల్లాలోనూ కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని... పోలీసులు భూపాలపల్లి కాటారం, మహదేవ్పూర్, కొయ్యూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు.