Stepwells In Warangal: సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో పునరుద్ధరించిన పురాతన మెట్లబావిని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలనాటి చారిత్రక సంపదను పది కోట్ల రూపాయలు ఖర్చుచేసి పర్యాటకంగా అద్భుతంగా అభివృద్ధి చేశారు. భాగ్యనగరానికి మరో మణిహారంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న ఓరుగల్లులో మాత్రం మెట్లబావులను పట్టించుకునే వారే కరవయ్యారు.
వారసత్వ సంపదను పరిరక్షించుకోవడంలో నిర్లిప్తత: ఓరుగల్లులో తాగునీటి కోసం కాకతీయులు మెట్ల బావులను తవ్వించారు. బావుల నుంచి నీటిని సులభంగా తీసుకునేందుకు చుట్టూ మెట్లను నిర్మించారు. భూకంపాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడేలా నిర్మించిన ఈ మెట్ల బావులు ఒకప్పుడు తాగు.. సాగునీటికు ఉపయోగపడుతూ అందరి అవసరాలను తీర్చాయి. మారుతున్న కాలంలో ఎవరూ ఉపయోగించక పగిలిన కుండల్లా మిగిలిపోయాయి. అలనాటి వారసత్వ సంపదను పరిరక్షించుకోవడంలో నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది.
కాకతీయుల కళావైభవాన్ని కాపాడాలి: వరంగల్‌లోని శివనగర్, కరీమాబాద్, ఖిలా వరంగల్, కొత్తవాడ ప్రాంతాల్లో ఎన్నో మెట్ల బావులున్నా.. నగరీకరణతో చాలా వరకు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం 15 మాత్రం మనుగడలో ఉండగా.. కేవలం అయిదు మెట్ల బావులు ప్రధానమైనవి. కొన్నేళ్ల కిందట వరంగల్ నగర పాలక సంస్థ రూ.15 లక్షలు ఖర్చు చేసి చెత్తను తొలగించినా.. తర్వాత నిర్వహణ గాలికొదిలేశారు. ప్రస్తుతం బావుల వద్దా చెత్తా చెదారం, రాళ్లు రప్పలు తుప్పలతో రక్షణ గోడలు దెబ్బతిన్నాయి.
కాకతీయుల కళావైభవాన్ని కాపాడాలని స్థానికులు, చరిత్ర ప్రేమికులు కోరుతున్నారు. చారిత్రక నగరి ఓరుగల్లులో మెట్లబావుల నిర్వహణపై దృష్టిసారించాలని స్థానికులు విజ్ఞప్తిచేస్తున్నారు. పురావస్తు శాఖతోపాటు.. ప్రభుత్వం కార్యాచరణ చేపడితేనే మెట్లబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
"కాకతీయ కాలం నాటి వైభవం గుర్తుకు వస్తాయి. ఇన్ని రోజులు అధికారులు పట్టించుకోకపోవడంతో కనుమరగయ్యాయి. కాకతీయులు వందల సంఖ్యలో బావులు తవ్వించారు. నగరీకరణ కారణంగా ప్రస్తుతం 15 మెట్ల బావులు మనుగడలో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తగు చర్యలు తీసుకోవాలి." - స్థానికులు
ఇవీ చదవండి: బన్సీలాల్‌పేట్ మెట్లబావిని చూస్తే మైమరిచి పోవాల్సిందే
నగర వాసులకు తీపి కబురు.. త్వరలో అటవీ పార్కులు
పుల్వామా దాడి నిందితుడికి షాక్.. జైషే మొహమ్మద్ కమాండర్ ఇల్లు నేలమట్టం