Mother's Day Special : అమ్మ తన జీవిత పర్యంతం కన్నబిడ్డల కోసం పరితపిస్తుంది. తన రక్త మాంసాలను పంచి మనకు జన్మనిచ్చిన అమ్మ.. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అటువంటి తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈమె పేరు అనసూర్య. వయస్సు 70 పైనే. శతాధికురాలైన ఈమె తల్లి పేరు బుచ్చమ్మ. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట చెందిన అనసూర్య తల్లి బాగోగులు చూస్తునే రోజు గడిపేస్తుంది. కడుపునిండా అన్నం పెడుతోంది. చిన్న బిడ్డలా తల్లిని ఒళ్లో పెట్టుకుని నిద్రపుచ్చుతుంది.
కళ్లు కనిపించక, కాలు విరిగి అడుగు ముందుకు వేయలేని తన తల్లి పరిస్థితి చూసి తల్లడిల్లినా మళ్లీ ధైర్యం తెచ్చుకుంది. వయస్సు పైబడి తనకు ఆరోగ్యం సహకరించకపోయినా తల్లికి ఏ కొరత లేకుండా సేవలు చేస్తూ.. అందులోనే అంతులేని తృప్తి పొందుతోంది. ఇంట్లో పనంతా తొందరగా చేసుకుని మిగిలిన సమయం అంతా తల్లిని చూసుకునేందుకే కేటాయిస్తుంది. నవమాసాలు మోసి పెంచిన తల్లిని కాదని బిడ్డల దగ్గర ఉండలేనని అనసూర్య చెబుతోంది.
Daughter caring of mother in Warangal : అనసూర్యకు ఐదుగురు బిడ్డలు. తమతో ఉండమని బిడ్డలు పిలిచినా తల్లిని విడిచి వెళ్లేందుకు ఆమె మనస్సు అంగీకరించలేదు. ఇద్దరినీ చూసే స్థోమత కుమారులకు లేదు. దీంతో మంచానికే పరిమితమైన తల్లికి అన్ని తానై సపర్యల చేస్తోంది. జన్మనిచ్చినందుకే బిడ్డ లాగా చూసుకుంటోందని బతుకమ్మ పాటలు పాడుతూ తన ఆనందాన్ని తెలియపరుస్తోంది తల్లి బుచ్చమ్మ.
"మా కొడుకులు నన్ను వాళ్ల దగ్గరకు రమ్మంటారు కానీ నేను వెళ్లను. మా అమ్మ రుణం నేను కాకుంటే ఎవరు తీర్చుకుంటారు. ఆవిడకు కళ్లు కనిపించవు, కాళ్లు విరిగిపోయాయి సరిగ్గా నడవలేదు. పైగా ఎవరు లేరు. ఆమె బతికున్నంత వరకు నేను ఆమెను బాగోగులు చేసుకుంటా. ఉదయం టీ ఇస్తా ఆ తరువాత టిఫిన్ చేసి పెడతా. ఆ తరువాత స్నానం చేసి నిద్రపుచ్చుతాను. పింఛన్ డబ్బులే మాకు జీవనాధారం". - అనసూర్య, కుమార్తె
ఇద్దరికీ పింఛన్ డబ్బులే ఆధారం. కొద్దిగా పొలం ఉంది. ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సి వస్తే అమ్మకు అన్నీ అమర్చి, ఇంటి పక్కనుండే వారికి జాగ్రత్తలు చెప్పి మళ్లీ సాయంత్రం లోగా తిరిగి వచ్చేస్తుంది. కొందరు కనిపెంచిన తల్లిదండ్రులను అవసాన దశలో గాలికొదిలేసే ఈ రోజుల్లో తన బాగును పక్కన పెట్టి తల్లి బాగోగుల కోసం పరితపిస్తున్న అనసూర్య అందరికీ ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇవీ చదవండి: