damera rakesh: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఖానాపురం మండలం దబీర్పేటలో రాకేశ్ నివాసముంటున్నాడు. రాకేశ్‌ది నిరుపేద కుటుంబం. వ్యవసాయమే వారి జీవనాధారం. తల్లిదండ్రులు కుమారస్వామి-పూలమ్మ. మృతునికి ఇద్దరు అక్కలున్నారు. వారికి వివాహాలయ్యాయి. పెద్దక్క ప్రస్తుతం బీఎస్ఎఫ్లో పని చేస్తోంది. రాకేశ్ హనుమకొండలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. 6 నెలల క్రితం జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఫిజికల్ టెస్ట్ పరీక్ష పాసై.. ఇప్పుడు ప్రవేశపరీక్షకు సన్నద్ధమవుతున్నాడు.
నిన్న సాయంత్రం ఆర్మీ కార్యాలయంలో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇవాళ ఉదయం జరిగిన ఆందోళనలో జరిగిన కాల్పుల్లో రాకేశ్ చనిపోయాడు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు.. హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు రాకేశ్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే పల్స్ లేదని.. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఉపయోగం లేకపోయిందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.
దామెర రాకేశ్ మృతికి నిరసనగా రేపు నర్సంపేట నియోజకవర్గం బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పిలుపునిచ్చారు. 'అగ్నిపథ్'ను ప్రశ్నిస్తే హత్య చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రేపు నియోజకవర్గ బంద్‌లో అందరూ పాల్గొనాలని పెద్ది విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆయన రాకేశ్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబసభ్యులు, బంధువులను పరామర్శించారు.
ఇవీ చూడండి..
Agnipath Protests in Secunderabad :పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. నలుగురికి బుల్లెట్ గాయాలు
'అగ్నిపథ్'పై హైదరాబాద్ ఆగ్రహం.. రణరంగంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
'అగ్నిపథ్'పై ఆగని నిరసనల హోరు.. పలు చోట్ల రైళ్లకు నిప్పు
Agnipath Protest: రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో హై అలర్ట్..